Monday, 11 May 2020

శ్రుత + శ్రుతి - 1


శ్రుత శ్రుతి సంభాషణం - 1

ఒక వీకెండ్. 
సమయం - మధ్యాహ్నమూ కాదు, సాయంత్రమూ కాదు - ఆ రెండింటి మధ్యలో ఒక ఘడియ (ఎందుకంటే శనివారం అనగానే హాస్టల్ జీవితాలకి సూర్యుడు 10 దాకా ఉదయించడు గాబఠ్ఠి!).

శ్రుతి - (వంకాయ వేచుతూ మధ్యలో) "తెల తెల వారుతున్న ఆ సూర్యభగవానుని కిరణాల్లా ఆ తెలుపు చూడు ఈ వంకాయలో, వెన్న ముద్దలా ఇఠ్ఠే కరిగిపోతుందేమో నోట్లో వేస్కుంటే!...

ఒసేయ్ కీర్తీ, ఆకలేసేస్తోందే! ఈ వేపుడు హెప్పటికి అయ్యేనో హేవిటో!"

కీర్తి - "ఈ ఆలస్యాన్ని, ఆదమరుపు అంత అందంగా చేయగలను నేను"

S - "హెలా హలా!"

K - "నువ్వు అలా గరిటెను ధనువులా చాచుతూండు, నేను ఇపుడే బాణంలా వెళ్ళి బుడుగు పుస్తకం పట్టుకువస్తా!"...

కరెక్టుగా ఒక 10 సెకనులలోపల...

S - "హేవే, అక్కడే ఏం చేస్తున్నావ్? ఇక్కడ ధనువు ఎక్కుపెట్టి రెడీగా ఉంటే!"

K - "నేనేం చిన్నదానినా, చితకదానినా! ప్రయివేటు పీకేస్తున్నావ్ నాకు! వస్తున్నా ఆగెహె! నీ ఆత్రం నువ్వూనూ...!"

S - "హబ్బ! హెన్నాళ్ళయిందే ఈ మాటలు విని! హేవిటో!! 'పుష్ అండ్ పుల్ లైక్ అ మాగ్నెట్ డూ' లు మాత్రమే వినపడే ఈరోజుల్లో నీకు నేనూ నాకు నువ్వూ, శర్మా శాస్త్రీ, షెర్లాకూ వాట్సనూ, లాగ దొరికేశాము!... "

K - "బావుంది నీ కీర్తిత్కర్ష! అంటే స్వోత్కర్ష లో త్కర్షని అన్వయించి వాడేశా, కరెక్టో కాదో తర్వాత్చూస్కుందాం.....,
బుడుగు వెయిట్ చేస్తోంది, వంకాయ ఆపసోపాలు పడుతోంది.. ఇంక త్వరగా కానివ్వాలి!"

S -"హోకే! మొదలెట్టెయ్ మరి!"

K - "నా పేరు బు..."

S - "ఒసేయ్, మనం బాపు గారు రమణ గారి లాగ కూడానే! ఇందాకటి దాన్లో ఈ ఉపమానం కూడా కలిపేస్కో!....."

K - "సరే ఓకె.

"ఇంకో పేరు పిడుగు... మా బామ్మ హారి పిడుగా అంటుంది........"

S - "అవునే, ఈ అకాల వర్షాలతో పిడుగులు పడుతున్నాయ్ కదా చెన్నైలో, అర్జున ఫల్గుణ పార్థ కిరీటీ... ఆ తర్వాత ఏంటి వస్తాయ్ నామాలు!..."

K - "ఒసేయ్, నీకు ఏదైనా గుర్తొస్తే ఆవగింజలో అరక్షణం కూడా ఆగవు కదా? అసహన పక్షీ...!" 

S - "హదెంటే హంత మాటనేశావ్, పిడుగా అనేసరికి, నీకు స్తోత్రాలూ నామాలూ కంఠోపాఠం కదా అని అడిగేను. హంతమాత్రం దానికి........!"

K - "ఇంక చాలు తల్లీ, వివరాలొద్దు, ఇప్పటికే నీ మొహంలో దీనరసం చూసి కరిగిపోయా! స్తోత్రాలూ అవీ ఇవీ ఎందుకు గాని, చాలా సులభమైన మార్గం ఉంది."

S - "హేవిటది!!!"

K - "'నరవరా ఓ కురువరా' పాడుకో, సరిపోతుంది!!"

S - "హబ్బ! ఒక నిముషం నీకు జోహార్లర్పించేందుకు మౌనంగా ఉంటా...!"

K - °°కీర్తి స్వగతం°° *ఇదే చాన్సు. ఇది మౌనంగా ఉండడమే నాక్కావలసింది*

"ప్రయివేటు మాష్టరు, పితూరీలు.... 
మినప రొట్టె, మీసాలవాళ్ళు................"

S - "హొసేయ్, మీసాలవాళ్ళంటే గుర్తొచ్చిందే. మొన్న నేను ఇంటి నించి తెచ్చుకున్న పిండితో మినపరొట్టె వేస్కుంటూంటే అనూష వచ్చింది. దానిని తింటావా అని అడగాలేకా, తెచ్చుకున్న పిండి ఇంక రెండు రొట్టెలకే సరిపోయేలా ఉంటే చూసి ఏడ్వాలేక, తెగ మధనపడిపోయాననుకో. ఎంతైనా ఈ జీవితం దుర్భరమే, దుర్భరం..."


K - బుక్కు మెల్లిగా మూస్తూ, 
"అంటే అసలు మినప రొట్టి పిండి తెచ్చినట్టు నాకు చెప్పాకుండా, నువ్వు హాయిగా తినేసి తెలియానివ్వకా, ఇపుడేమో అనూషకి ఇచ్చానని చెప్పబోతున్నావన్నమాట..."

S - °°శ్రుతి స్వగతం°° *హతవిధీ. ఘోర తప్పిదం. అతి ఘోర తప్పిదం.*

K - "ఇంకెందుకే బాపు రమణలూ, శర్మా శాస్త్రీ, షెర్లాకూ వాట్సనూనూ... అయిపోయింది..."

S - "హది కాదే, మరి చెగోడీలూ...."

K - "హా"

S - "టొమాటో మెంతి పచ్చడీ...."

K - "హమ్మో"

S - "ట్రయినులో కొన్న సోంపాపిడీ...."

K - "హమ్మో హమ్మో"

"......."

"......."

"......."


to be continued.


Originally written on 25th November, 2017 at Chennai.